కలం, వెబ్ డెస్క్ : విమానయాన రంగంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 10 టన్నుల బరువైన తొలి ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం ‘CE-25A’ (China Electric Aircraft) తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా (COMAC) పలు పరిశోధనా సంస్థలతో కలిసి దీనిని అభివృద్ధి చేసింది. నవంబర్ 14న ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్-టెస్ట్ ఇంజనీర్‌తో నిర్వహించిన ఈ తొలి ప్రయాణంలో విమానం పనితీరు అంచనాలకు అనుగుణంగా సాగినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
తక్కువ దూర ప్రయాణాలు, నగరాల మధ్య అనుసంధానం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ విమానంలో 19 మంది ప్రయాణించే వీలుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, 2,400 మీటర్ల ఎత్తులో ఏకధాటిగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. భవిష్యత్తులో పైలట్ సహాయం లేకుండా కూడా ప్రయాణించేలా ఇందులో అత్యాధునిక టెక్నాలజీని పొందుపరిచారు. ప్రాంతీయ విమానయాన రంగంలో ఈ ఎలక్ట్రిక్ విమానం ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది.

