కలం, చండూరు : నల్గొండ జిల్లా చండూరు (Chandur) మున్సిపాలిటీ కేంద్రంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. స్థానిక మార్కెట్ యార్డ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరిగిన కత్తుల దాడి పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు యువకులు కలిసి మరో యువకుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు టౌన్‌కు చెందిన నాగిళ్ల నరేష్, విజయ్ అనే ఇద్దరు యువకులకు, అదే ప్రాంతానికి చెందిన దోటి శివ అనే యువకుడికి మధ్య కొంతకాలంగా పాత గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పాత కక్షలను మనసులో పెట్టుకున్న నరేష్, విజయ్..ఆదివారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో చండూరు మార్కెట్ యార్డ్ వద్ద శివను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో మాట మాట పెరగడంతో ముందస్తు పథకం ప్రకారం తమ వద్ద దాచుకున్న కత్తితో శివపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో దోటి శివ కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడివున్న శివను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివను చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు నాగిళ్ల నరేష్, విజయ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

