కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందు నియోజకవర్గం, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన బాసని నాగేశ్వరరావు రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం (Khammam) లోని మమత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపి నాయకులు డాక్టర్ పొగాకు జైరామ్ చందర్ వెంటనే హాస్పిటల్‌కు చేరుకుని నాగేశ్వరరావును పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ జైరామ్ చందర్ హాస్పిటల్ నుంచే నేరుగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడించారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబమని, ప్రమాదానికి గురైన కార్యకర్త కుటుంబం ఎలాంటి అధైర్యానికి లోనుకావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
నాగేశ్వరరావు కుటుంబానికి పార్టీ ఆర్థికంగా, అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ వెన్నంటి ఉంటుందని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నాగేశ్వరరావు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

