కలం, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా తప్పుకుంటున్నట్లు తెలిపారు. నైతిక బాధ్యత వహించి, తమ పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ఇరువురు పేర్కొనడం గమనార్హం.
8 మందిపై కేసులు నమోదు..
లెక్కింపుల్లో అక్రమాలు జరిగినట్లు సిట్ నిర్ధారించడంతో నిన్న ఆలయ ట్రస్ట్ సభ్యుడు శ్రీ కృష్ణ మోహన్ అయోధ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తిన్నూ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామశంకర్ మిశ్రా, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, కరుణేశ్ పాండే, లవకుశ్ మిశ్రాపై నమ్మకద్రోహం, ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడటం వంటి సెక్షన్లు యాడ్ చేశారు.
ఎవరినీ వదిలిపెట్టేదే లేదు: సీఎం యోగి ఆదిత్యనాథ్
అయోధ్య విరాళాల అవకతవకల విషయం తెలియగానే సిట్ విచారణకు ఆదేశించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. రిపోర్ట్ చేతికి రాగానే.. చర్యలు ప్రారంభించామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అయోధ్య అంటేనే సనాతన ధర్మం, నమ్మకానికి ప్రతిరూపమని.. పవిత్రక్షేత్రంపై ఒక్కరి కన్ను కూడా పడనీయబోమన్నారు. రాముడి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని పార్టీలను కోరారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం మానుకోవాలన్నారు.

