కలం, నల్లగొండ బ్యూరో : క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఇకనైనా తన ధోరణి మార్చుకోవాలని భువనగిరి ఎంపీ చామల (Chamala) కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు తెలిసింది ఫామ్‌హౌస్ పాలనే
‘కేసీఆర్‌కు కేవలం ఫామ్ హౌస్ పరిపాలన మాత్రమే తెలుసు. రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ఆయనకు కనీస అవగాహన లేదు. రెండున్నర ఏళ్లుగా రాష్ట్ర ప్రజలతో ఆయనకు సంబంధం తెగిపోయింది. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలంతా ప్రజా గళాన్ని బలంగా వినిపిస్తుంటే.. ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని కేసీఆర్ అనడం విడ్డూరం. మీరే కావాలని బీజేపీ ఎంపీలను గెలిపించుకుని, ఇప్పుడు మాపై విమర్శలు చేస్తారా? కేసీఆర్.. మీరు అప్‌డేట్ కావాలి’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. తన కూతురు కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ఎంపీ ప్రశ్నించారు.
కూతురి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు
‘నీ కూతురు వ్యాఖ్యలపై నీ మౌనం అంగీకారమేనా? కవిత చేసిన ఆరోపణలు నిజమో కాదో సమాధానం చెప్పిన తర్వాతే కేసీఆర్ వేరే విషయాలు మాట్లాడాలి. జేబులు చూసి పరిపాలన చేసిన చరిత్ర మీది. ప్రజల సొమ్ముతో జేబులు నింపుకున్న మీరు, ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం’ అని చామల (Chamala) మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్ధంతులు జరుపుకోవాల్సిందే
వరుస ఎన్నికల్లో ఓడిపోయి అడ్రస్ కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ ఇకనుండి జయంతి ఉత్సవాలు కాదు.. వర్ధంతులు జరుపుకోవాలని విమర్శించారు. మీరు గతం గురించి మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీయాలని, ప్రజాపాలనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. కనీసం ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప, ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ చావును ఈ రాష్ట్రంలో ఎవరూ కోరుకోవడం లేదని, ఆయన చావు కోరుకునేది కేవలం వారి కుటుంబ సభ్యులేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తన విజ్ఞతను ఉపయోగించి మాట్లాడాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకోవాలని, ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.

