హైదరాబాద్‌లో ‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం.. అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మణికొండ నెక్నాంపూర్ పరిధిలో ‘చెడ్డీ గ్యాంగ్’ (Chaddi Gang) కలకలం రేపింది. సుమారు ఆరుగురు సభ్యులతో కూడిన అనుమానిత గ్యాంగ్ స్థానిక ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించి భారీ చోరీకి పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. దొంగలు అపార్ట్‌మెంట్ వెనుక వైపు ఉన్న కంచెను కత్తిరించి లోపలికి ప్రవేశించారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా జాగ్రత్తగా సీ-బ్లాక్‌లోకి చేరుకున్నారు. ఒక ఫ్లాట్ తలుపులు బగలుగొట్టి లోపల ఉన్న నగదుతో పాటు, 5 విలువైన వాచీలను అపహరించుకుపోయారు.

అయితే చోరీ జరుగుతున్న సమయంలో దుండగుల కదలికలను గమనించిన ఒక నివాసి వారిని నిలదీసేందుకు యత్నించగా, ఆయుధాలతో బెదిరించి దాడికి ప్రయత్నించి అక్కడి నుంచి పరారు అయినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని, దొంగల కదలికల ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ప్రజలకు పోలీసుల హెచ్చరిక

ఈ ఘటన నేపథ్యంలో నెక్నాంపూర్‌, అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే నేరుగా వారిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించవద్దని, వెంటనే నార్సింగి పోలీసులకు లేదా డయల్ 100కి సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>