Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వం రైతుల ధాన్యం డబ్బులు చెల్లించాలి: చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: భారత దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణమని, అప్పుల భారాన్ని, ధరల భారాన్ని మోడీ ప్రజలపై వేస్తున్నాడని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) ఆరోపించారు. శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని ముస్క్ రాజిరెడ్డి స్మారక భవన్ లో పార్టీ మండల కౌన్సిల్ సేవ్స్ సమావేశం తమ్మిశెట్టి రవీందర్ అధ్యక్షతన జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై రోజు రోజుకు పెనుభారం మోపుతుందని మండిపడ్డారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశానికి 55 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉంటే 12 సంవత్సరాలలో దానికి నాలుగింతలు పెరిగి దాదాపుగా 214 లక్షల కోట్లకు పైగా మోడీ (Modi) ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ధరల పెరుగుదలను చూస్తూ ఉన్నారే తప్పా చేసిందేమీ లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తాదని కళలు కంటున్న బీజేపీ 12 ఏళ్లలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ చేసిందని, ఇంకా పేరుగుతాయని సంకేతాలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచిందని, 75 రూపాయలు ఉన్న కిలో నూనె నేడు 165 రూపాయలు పెరిగిందన్నారు. కంది,పెసర, శనిగ పప్పులు, నిత్యం వంటకు ఉపయోగపడే ప్రతీ వస్తువు ధర పెంచడంతో పేదల కొనుగోలు శక్తి పడిపోయిందని అన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతుందని, పెట్టుబడిదారులకు కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేస్తూ అనేక రాయితీలు ఇస్తుందని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు మాత్రం రుణాలు, రాయితీలు ఇవ్వడం లేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి, కూలీల పొట్టలు కొడుతుందని, 60 శాతం కేంద్రం 40% రాష్ట్రాలు ఆ పథకానికి నిధులు ఇవ్వాలని చెప్పడం దారుణమన్నారు.

రాష్ట్రాల వాటా ధనాన్ని పెంచి రాష్ట్రాలపై భారం వేస్తుందని, హక్కులను హరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని వెంకటరెడ్డి (Chada Venkat Reddy) కోరారు. మండలంలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణాన్ని బలోపేతం చేయడం కోసం శ్రేణులు పనిచేయాలని, సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, బూడిద సదాశివ, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ, ముల్కనూర్ ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, వార్డు సభ్యురాలు రాకం అంజవ్వ, మహిళా సమాఖ్య నాయకురాలు కయ్యం సుజాత, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: అక్క‌డ‌ బీచ్‌లో నిద్ర‌పోతున్న‌ జ‌నం.. ఎందుకంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>