బాధితులకు న్యాయం చేయాలని సీఎంను కోరుతా: చాడ

కలం, కరీంనగర్: కొత్తపెల్లి నుండి హుస్నాబాద్ వరకు ప్రభుత్వం 4 వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. రోడ్డు వెడల్పులో భాగంగా ఇండ్లు, భూములు కోల్పోతున్న బాధితులు ధర్నాకు దిగారు. వీరి ధర్నాకు  సీపీఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) మద్దతు తెలిపారు. ప్రభుత్వం పునరావాసం కల్పించి, నష్టపరిహారం చెల్లించాలని.. వారికి తగిన న్యాయం చేయాలని, ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని అన్నారు.

చిగురుమామిడిలో (Chigurumamidi) రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న బాధితులు రెండు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం చాడ వెంకటరెడ్డి సందర్శించారు. బాధితులు చాడ వెంకటరెడ్డితో గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డుకు వ్యతిరేకం కాదని అన్నారు.

కానీ వెడల్పు కోసం ప్రజల నివాసాలు కూల్చి వారికి ఎలాంటి న్యాయం చేయకపోవడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమని చెప్పారు. 70 ఏండ్ల నుండి ఇండ్లు ఉన్నవారు, ఇటీవల నూతనంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఇండ్లు నిర్మించుకున్న వారి ఇండ్లను కూల్చడం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా నిర్మించుకొని ఉన్న ఇంటిని కోల్పోతే వారి బాధ వర్ణాతీతమని చాడ వెంకటరెడ్డి  అన్నారు. కంటి తుడుపు చర్యగా ఏదో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మాటల వరకు చెప్పడం వల్ల వారి నష్టాన్ని భర్తీ చేయలేమని తెలిపారు. బైపాస్ ద్వారా రోడ్డు మార్గం వేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టుల నిర్మాణంలో,కాలువల నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించినట్లుగా ఈ ఇండ్లు కోల్పోతున్న బాధితులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

గతంలో కొన్ని చోట్ల ప్రాజెక్టులలో భూములు కోల్పోతే భూములు, ఇండ్లు కోల్పోతే ఇండ్లు ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా ఎంత ఇంటి జాగా పోతే అంత ఇంటి జాగా, కోల్పోయిన ఇంటి నిర్మాణ వ్యయం లెక్కేసి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. అందు కోసం ఈ మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, సీపీఐ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి వివరిస్తామని బాధితులకు న్యాయం జరిగేవిధంగా చూస్తానని వెంకటరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా ల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, తేరాల సత్యనారాయణ, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలీ బాపురెడ్డి, సీపీఐ నాయకులు కయ్యం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>