కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని (Telangana) మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వరంగల్ రూ.4,674 కోట్లతో వరంగల్ నగరంలో మురుగు నీటి వ్యవస్థ ఆధునీకరణ, రూ.840 కోట్లతో కరీంనగర్‌లో మోడల్ రోడ్లు, ఇతర నిర్మాణాలు, రూ.166 కోట్లతో ఖమ్మం- వరంగల్- కరీంనగర్ కారిడార్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల విలువ మొత్తం రూ.5681.04 కోట్లు కాగా, కేంద్రం 25 శాతం నిధులు రూ.1420.26 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వాటాగా 25 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, మిగిలిన మొత్తాన్ని హడ్కో రుణం రూపంలో కేంద్రం నిధులను సమకూర్చనుంది.
ప్రధాని మోదీకి ధన్యవాదాలు: కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణలో మూడు కీలక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసినందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దీనిలో కరీంనగర్‌కు రూ.840 కోట్లు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనిలో రూ.630 కోట్లతో మోడల్ రోడ్లు, స్కై వాక్స్, జంక్షన్లు డెవలప్ చేస్తారు. మరో రూ.130 కోట్లతో వరద ప్రవాహ నియంత్రణకు డ్రైన్లు ఏర్పాటు, రూ.80 కోట్లతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదించిన వాటిలో కరీంనగర్ లేదని.. తరువాత తాను స్వయంగా డీపీఆర్ దగ్గర నుంచి అన్ని వివరాలను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అందించడంతో ప్రాజెక్ట్ మంజూరైందని వివరించారు.

