కలం, తెలంగాణ బ్యూరో : ఇరాన్‌లో యుద్ధంతో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభ పరిష్కారానికి కేంద్రం కొత్త విధానానికి (LPG Policy) శ్రీకారం చుట్టింది. తప్పనిసరి అవసరం ఉన్నవారికి ఇబ్బందుల్లేకుండా నిబంధనల్లో మార్పు చేసింది. ఎల్పీజీ పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించడం, కొరతను అధిగమించడం, పరిమిత వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడం.. వీటిని పరిగణనలోకి తీసుకుని నిబంధనల్లో స్వల్ప సవరణలు చేస్తూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ శనివారం గెజిట్ జారీచేసింది. ఈ సవరణతో ఇకపైన పీఎన్‌జీ (PNG)ని వాడుకున్న కస్టమర్లు ఎల్పీజీ (LPG) కనెక్షన్లను వెంటనే సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. పీఎన్జీ కనెక్షన్ ఉన్న కస్టమర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎల్పీజీ రీఫిల్లింగ్ సిలిండర్లను సరఫరా చేయవద్దంటూ ఆయిల్ కంpngపెనీలకు కూడా ఉత్తర్వులు జారీచేసింది. సంక్షోభాన్ని అధిగమించడానికి, తప్పనిసరి అవసరం ఉన్న వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూడడానికి పెట్రోలియం మంత్రిత్వశాఖ ఈ మార్పులు చేసింది.
గతంలో పీఎన్జీ కనెక్షన్ ఉన్నా ఎల్పీజీ కనెక్షన్లను కొనసాగించుకోడానికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. ఏక కాలంలో అటు పీఎన్జీ, ఇటు ఎల్పీజీలను వాడుకునే వెసులుబాటు ఉండేది. రెగ్యులర్‌గా ఎల్పీజీ సిలిండర్లను రీఫిల్లింగ్ చేసుకునే సౌకర్యమూ ఉండేది. ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయాలన్న నిబంధన కూడా ఉండేది కాదు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ సవరణలు తీసుకొచ్చింది. పీఎన్జీ వాడుతున్న కస్టమర్లు తప్పనిసరిగా ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయాల్సిందేనని తాజా గెజిట్ (LPG Policy) తేల్చి చెప్పడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 33.37 కోట్లు ఉండగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద ఎల్పీజీ కనెక్షన్లు మరో 10.56 కోట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 1.56 కోట్ల పీఎన్జీ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతీ రోజూ సగటున 50 లక్షల డొమెస్టిక్ ఎల్పీజీ రీఫిల్లింగ్ సిలిండర్ల డెలివరీ జరుగుతున్నది. తాజా ఆంక్షలతో దాదాపు కోటిన్నర పీఎన్జీ కనెక్షన్లు ఉన్న వినియోగదారుల ఎల్పీజీ కనెక్షన్లు రద్దు కానున్నాయి.
Read Also: ఎల్పీజీ కష్టాలకు చెక్.. ఆల్టర్నేట్‌గా డీఎంఈ
Follow Us On: Instagram

