ఇరాన్‌పై ట్రంప్ ‘డీ-డే’ వార్.. గల్ఫ్‌లో గుబులు!

కలం, ఇంటర్నేషనల్ డెస్క్ : ఇరాన్‌ను లొంగదీసుకోవడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Trump ) సరికొత్త ఆర్థిక వ్యూహానికి తెరలేపారు. ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధిస్తూ, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డీ-డే’గా అభివర్ణిస్తున్న ఈ ఆర్థిక యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో ఆందోళన రేపుతున్నది. అమెరికా ఆంక్షల ఒత్తిడికి ఇరాన్‌ప్రతీకార చర్యలకు దిగితే.. గల్ఫ్‌ప్రాంతంలోని చమురు, ఇంధన మౌలిక వసతులు లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని ఆయా దేశాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

మరోవైపు, హర్మూజ్ జలసంధి పూర్తిగా అమెరికా భూభాగమేనని ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలు గల్ఫ్ దేశాల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అమెరికా విధించిన చమురు దిగుమతుల దిగ్బంధం వల్ల ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అక్కడ ద్రవ్యోల్బణం 80 శాతానికి పైగా పెరగ్గా, కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఈ ఆర్థిక ఆంక్షలు తదుపరి దశలో ఇరాన్తో వ్యాపారం కొనసాగించే భారత్, చైనా, తుర్కియే, యూఏఈ వంటి ప్రధాన భాగస్వామ్య దేశాలపై కూడా విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తలొగ్గే ప్రసక్తే లేదు: ఇరాన్

అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని, తమకు వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధానికి అంతే దీటుగా బదులిస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మోహసెన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలకు మద్దతు ఇచ్చే పొరుగు దేశాల ఇంధన మౌలిక సదుపాయాలు, వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా తాము ‘భూకంపం’ తరహాలో ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వెలుపల ఉన్న ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>