వామనరావు దంపతుల కేసు.. పుట్ట మధును విచారించిన సీబీఐ!

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల హత్య కేసు (Vaman Rao Couple Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ సముదాయంలో మాజీ మంథని శాసనసభ్యులు పుట్ట మధును అధికారులు విచారించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు మొత్తం 140 మందిని విచారిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

వామనరావు తండ్రి గట్టు కిషన్ రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రావు 2021 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్ రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్ లు వాదనలు వినిపించారు.

నడిరోడ్డుపై హత్య..

పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో దారుణంగా నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్ కు పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది. ఈ క్రమంలో వామనరావు దంపతుల కేసు దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు వామన్ రావు కేసును కొన్నినెలలుగా విచారిస్తున్నారు.

పుట్ట మధు విచారణ

న్యాయవాద దంపతుల హత్య కేసులో ఐదేళ్ల తర్వాత సీబీఐ మాజీ మంథని ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu)ను విచారించడం గురువారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణలో సీబీఐ అధికారులు పుట్ట మధును రెండు గంటల పాటు విచారించి పంపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>