కలం, జనగామ: దేవాదుల, నవాబుపేట రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల మూడు రోజుల ముచ్చటగానే మిగిలిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) విమర్శించారు. గురువారం దేవరుప్పుల మండలంలోని ధరావత్‌తండా నుంచి బంజార గ్రామం వరకు సుమారు 10 కిలోమీటర్లు కాలువ వెంట ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేసి, పంట పొలాలను పరిశీలించారు.
అనంతరం సింగరాజుపల్లిలో సాగునీటి కోసం ధర్నా చేపట్టారు. ధర్నా సందర్భంగా పోలీసులు ఎర్రబెల్లిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా బీఆర్‌ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎర్రబెల్లి తలకు గాయమైంది. అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 57 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, దేవరుప్పులలో ఏ చెరువు నింపిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
దేవాదుల రిజర్వాయర్‌లో నీరు ఉన్నా వినియోగించకపోవడం దారుణమన్నారు. ధరావత్‌తండాకు చెందిన రైతు కున్సోతు వెంకన్న 16 బోర్లు వేసినా ఒక్కదాంట్లోనూ నీరు పడలేదని, నాలుగు ఎకరాల పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. వెంకన్నను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవరుప్పుల, కోడకండ్ల మండలాలకు సాగునీరు అందే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

