కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని అప్పుడే టీమ్ ఇండియాలోకి తీసుకురావద్దని వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ (Carlos Brathwaite) భారత సెలెక్టర్లకు సూచించారు. శనివారం జైపూర్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులతో విరుచుకుపడటంతో అతడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలోనే బ్రాత్‌వైట్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైభవ్ అద్భుత ప్రదర్శన చూసి క్రిస్, శ్రీకాంత్ వంటి దిగ్గజాలు అతడిని వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి పంపాలని భావిస్తుండగా, బ్రాత్‌వైట్ మాత్రం మరోలా స్పందించారు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అప్పట్లో తమ బోర్డు ఎలా హ్యాండిల్ చేసిందో గుర్తు చేస్తూ.. వైభవ్ విషయంలో కూడా భారత్ అలాగే వ్యవహరించాలని చెప్పారు. లారా అప్పట్లో గొప్ప టాలెంట్ అని అందరికీ తెలిసినా, అతడిని నేరుగా జట్టులోకి పంపకుండా వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాల మధ్య ఉంచి రాటుదేలేలా చేశారని ఆయన పేర్కొన్నారు.
అదే పద్ధతిని భారత్ కూడా అనుసరించాలని బ్రాత్‌వైట్ అభిప్రాయపడ్డారు. వైభవ్‌ను జట్టులో ఉంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ల దగ్గర నేర్చుకునే అవకాశం ఇవ్వాలని, అంతేకానీ ఇప్పుడే నేరుగా మైదానంలోకి దింపవద్దని హితవు పలికారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ (Vaibhav Suryavanshi) 12 సిక్సర్లు, 5 ఫోర్లతో చెలరేగినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు.
మరోవైపు మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. వైభవ్ సాంకేతికంగా చాలా బలంగా ఉన్నాడని, అయితే మానసికంగా అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని తట్టుకోగలడా లేదా అనేది ఆలోచించాలని సూచించారు. గతంలో చాలా మంది ప్రతిభావంతులు ఇలాగే వచ్చి దారి తప్పారని, వైభవ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుతం వైభవ్ ఈ సీజన్లో 8 మ్యాచ్‌లలో 357 పరుగులు చేసి, 234 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు.

