కలం, వెబ్ డెస్క్ : సమాజంలో జరుగుతున్న నేరాలను అడ్డుకోవడంలో పోలీసులది కీలక పాత్ర. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న కొందరు దారుణానికి ఒడిగట్టారు. క్యాన్సర్ వ్యాధి భారిన పడిన ఓ యువకుడి(30) పై పోలీసులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ అసహ్యకరమైన ఘటన హర్యానా (Haryana) లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లా బన్‌గావ్ గ్రామానికి చెందిన యువకుడి బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతడు కీమోథెరపీ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో జూన్ 17వ తేదీన రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. మొహానికి గుడ్డ కట్టుకోవడంతో ఇద్దరు ఎస్ఐలు, ఓ హోంగార్డు యువకుడిని ఆపి తనిఖీలు నిర్వహించారు.
అనంతరం యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, బట్టలు విప్పేసి, దారుణంగా కొట్టినట్లు బాధితుడు ఆరోపించారు. కీమోథెరపీ కారణంగా కాళ్లకు వెంట్రుకలు లేవని అమ్మాయి లాగా ఉన్నావని వేధించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. తరువాతి రోజు బాధితుడికి తీవ్ర రక్త స్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో యువకుడిపై లైంగిక దాడి జరగడంతో పాటు పక్క ఎముకలు విరిగినట్లు తేలింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు అఘాయిత్యానికి ఒడిగట్టిన పోలీసులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ నిమిత్తం ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ చంద్రమోహన్ వెల్లడించారు.

