కలం, స్పోర్ట్స్ : బుండెస్లీగా (Bundesliga 2026-27) సీజన్ నేటి నుంచే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అలియాంజ్ అరేనా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎఫ్‌సీ బేయర్న్ మునిచ్, విఎఫ్‌బి స్టట్‌గార్ట్ జట్లు తలపడుతున్నాయి. జర్మన్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ప్రత్యర్థుల పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన 114 మ్యాచ్‌లను మైదానంలో దాదాపు 63 లక్షల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించారు.
సొంత మైదానంలో ఆడుతున్న బేయర్న్ మునిచ్‌కు ఈ లీగ్ ఓపెనర్లలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 24 ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమనేదే ఎరుగకుండా 19 విజయాలు, 5 డ్రాలతో నిలిచింది. అయితే, కొత్త సీజన్ ప్రారంభంలో బేయర్న్ ఆటగాళ్లను గాయాల సమస్య వేధిస్తోంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని, పటిష్టమైన బేయర్న్‌ను దెబ్బకొట్టి కొత్త చరిత్ర సృష్టించాలని స్టట్‌గార్ట్ భావిస్తోంది.
మరోవైపు, ఎస్‌వి ఎల్వర్స్‌బెర్గ్ జట్టు తొలిసారిగా బుండెస్లీగాలో అడుగుపెడుతూ చరిత్ర సృష్టించనుంది. లీగ్‌లో పోటీపడుతున్న అత్యంత చిన్న పట్టణంగా నిలిచిన ఎల్వర్స్‌బెర్గ్, తమ తొలి మ్యాచ్‌లో బైయర్ 04 లేవర్కూసెన్‌తో తలపడనుంది. అలాగే మార్టిన్ డెమిచెలిస్ సారథ్యంలో ఆర్‌బి లైప్‌జిగ్, ఆడి హట్టర్ నేతృత్వంలో ఐంట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్ వంటి జట్లు కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి.
శనివారం బోరుస్సియా డోర్ట్‌ముండ్ – హ్యాంబర్గర్ ఎస్‌విల మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుండగా, ఆదివారం ఫ్రీబర్గ్ – వెర్డర్ బ్రెమెన్ జట్లు కొట్లాడనున్నాయి. గాయాల కలకలం, సరికొత్త కోచ్‌ల వ్యూహాల మధ్య ఈ సీజన్ తొలి వారాంతం ఫుట్‌బాల్ ప్రేమికులకు భారీ విందు అందించనుంది.

