కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి(Nelakondapalli) మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకాకపోవడం, పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించకపోవడంపై ప్రశ్నించి మందలించినందుకు ఓ విద్యార్థి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేకల గోపాలకృష్ణ లెక్చరర్ కమ్ లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు. అదే కళాశాలలో హైదర్‌సాయిపేటకు చెందిన భూక్యా రాము ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హెచ్ఈసీ చదువుతున్నాడు. స్థానిక డిగ్రీ కళాశాల హాస్టల్లో ఉంటున్న రాము తరగతులకు సరిగా హాజరుకాకపోవడం, పరీక్ష ఫీజు చెల్లింపులో నిర్లక్ష్యం వహించడంతో గోపాలకృష్ణ కొద్ది రోజుల క్రితం అతడిని మందలించారు.
దీంతో ఆగ్రహం పెంచుకున్న విద్యార్థి ఈ నెల 5న తన తండ్రిని వెంటబెట్టుకుని కళాశాలకు వచ్చాడు. విద్యార్థి ప్రవర్తన గురించి తండ్రికి వివరించి లెక్చరర్ మరోసారి మందలించడంతో రాము ఆగ్రహంతో ఆయనపై పిడిగుద్దులతో దాడి చేశాడు. తండ్రి అడ్డుకునేందుకు ప్రయత్నించినా విద్యార్థి వెనక్కి తగ్గకుండా దాడి కొనసాగించాడు. తీవ్రంగా గాయపడిన గోపాలకృష్ణ ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఘటన జరిగిన రోజు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు విధులకు హాజరుకాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినప్పటికీ, విద్యార్థి భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో గోపాలకృష్ణ ఫిర్యాదుకు అంగీకరించలేదని సమాచారం. అప్పట్లో మరుగునపడిన ఈ ఘటన చివరకు ఆయన ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనతో అధ్యాపకుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. కళాశాలల్లో తమకు భద్రత లేదని అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

