​గోదావరిఖని గడ్డపై పీటీ స్వామి కాంస్య విగ్రహం: హరీశ్ రావు

కలం, ​గోదావరిఖని: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ విద్యావేత్త పీటీ స్వామి (PT Swamy) సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం గోదావరిఖనిలో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఎంత ఖర్చయినా బీఆర్ఎస్ పార్టీ భరిస్తుందని స్పష్టం చేశారు.

​పీటీ స్వామి దశదిన కర్మ సందర్భంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని (Godavarikhani) మార్కండేయ కాలనీలోని ఆర్‌కే గార్డెన్స్‌లో నిర్వహించిన సంస్మరణ సభకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పీటీ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ పరంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టీబీజీకేఎస్ ఆవిర్భావానికి మూలకారకుడు

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పీటీ స్వామిని కోల్పోవడం ఆయన కుటుంబానికే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి, సింగరేణి కార్మిక లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త విన్న వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ ఎంతో బాధపడ్డారని, కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధులుగా సంస్మరణ సభకు హాజరైనట్లు వెల్లడించారు. కేసీఆర్‌కు పీటీ స్వామి అంటే ఎంతో అభిమానం, గౌరవం ఉండేవని గుర్తుచేశారు.

​”సింగరేణిలో కొత్తగా కార్మిక సంఘం ఏర్పాటు చేయాలనే ఆలోచన మొదట్లో కేసీఆర్‌కు అంతగా నచ్చలేదు. అప్పటికే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల్లో ఉన్న కార్మికులంతా తెలంగాణ బిడ్డలేనని, ప్రత్యేక సంఘం పెడితే ఉద్యమానికి దూరమవుతారని భావించారు. కానీ పీటీ స్వామి, కొప్పుల ఈశ్వర్ తదితరులు కేసీఆర్‌ను ఒప్పించి టీబీజీకేఎస్ ఏర్పాటుకు కృషి చేశారు. ఈ రకంగా టీబీజీకేఎస్ ఆవిర్భావానికి పీటీ స్వామి మూలకారకుడిగా నిలిచి, సంఘం తొలి గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.” అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

నిస్వార్థ ప్రజా సేవకుడు

​2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటైన నెల రోజుల్లోపే కొప్పుల ఈశ్వర్, మురళీధర్‌లతో కలిసి పీటీ స్వామి పార్టీలో చేరారని హరీశ్‌రావు తెలిపారు. అప్పటి నుంచి మరణించే వరకు 26 ఏళ్ల పాటు కేసీఆర్ వెన్నంటి ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన అనంతరం ఉద్యమంలోకి వచ్చి, మేధావుల్లో మేధావిగా, కార్మికుల్లో కార్మికుడిగా, విద్యావంతుల్లో విద్యావంతుడిగా అన్ని వర్గాల గౌరవాన్ని పొందారని పేర్కొన్నారు. ​దాదాపు 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదుకు నిబద్ధతతో కృషి చేశారని చెప్పారు. కాగజ్‌నగర్ పేపర్ మిల్లు మూతపడిన సమయంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేశారని గుర్తుచేశారు.

గోదావరిఖని గడ్డపై కాంస్య విగ్రహం

​పీటీ స్వామి సేవలు భావితరాలకు గుర్తుండిపోయేలా గోదావరిఖని గడ్డపై ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కొప్పుల ఈశ్వర్, చందర్, రాజిరెడ్డిలతో పాటు స్థానిక పెద్దలను కోరారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.

​పీటీ స్వామి ఆశయాలను, కార్మికుల కోసం చేసిన కృషిని కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఆయన ప్రాణప్రదంగా నిర్వహించిన వృద్ధాశ్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ పార్టీతో పాటు కొప్పుల ఈశ్వర్, స్థానిక నాయకత్వం, తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పీటీ స్వామి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>