కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) జిల్లా నందిపేట్ (Nandipet) మండల కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. నయీం అనే యువకుడిపై కొందరు మారణాయుధాలతో దాడి చేయడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. నందిపేట్ రాజ్‌నగర్ కాలనీకి చెందిన పెయింటర్ షేక్ నయీం (30)పై ఆదివారం కత్తులు, ఇనుప రాడ్లతో మూకగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడి తల, చేతులు, కడుపు భాగాలలో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న నయీంను కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అత్యవసర వైద్య చికిత్స అందుతోంది.
పాత కక్షలే కారణమా?
బాధితుడి వదిన వసీమ బేగం ఫిర్యాదు మేరకు షేక్ తారిఖ్, తాహెర్, సాజిద్, షాహిద్, గాలిబ్ తదితరులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ప్రతీకార దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవనున్నాయి. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని నందిపేట్ ఎస్సై వినయ్ తెలిపారు.

