కేఎల్‌ఐ, జూరాల నుంచి నీళ్లు విడుదల చేయాలి: బీఆర్‌ఎస్

కలం, వనపర్తి: కేఎల్‌ఐ, జూరాల ప్రాజెక్టుల నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి (Wanaparthy) పట్టణంలోని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా (BRS Protest) నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటు రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ కేఎల్‌ఐ, పాలమూరు పంపులను నిర్విరామంగా నడపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కేఎల్‌ఐ కింద ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు వెంటనే నీరందించాలని, పెద్దమందడి మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందలేదన్నారు. జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని, పాలమూరు పంపులను నడిపి ఏదుల, కర్వెన రిజర్వాయర్లను నింపాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు సాగునీటి కోసం ఆందోళన చేయాల్సి వస్తోందని విమర్శించారు. కేఎల్‌ఐ పంపుల ప్రారంభం బీఆర్‌ఎస్‌ పోరాట ఫలితంగానే సాధ్యమైందన్నారు. రామన్నగట్టు రిజర్వాయర్‌ నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులను ఆదుకోవాలంటే కేఎల్‌ఐ, జూరాల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం జలాలతో కొత్తకోట మండలంలోని రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. గతంలో కందూరు వాగుకు కృష్ణా జలాలను తీసుకొచ్చి రైతులకు ప్రయోజనం చేకూర్చామని గుర్తుచేశారు. ప్రస్తుతం సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేఎల్‌ఐ పంపులను నిరంతరం నడిపి పాలమూరు రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌, పలుస రమేష్‌గౌడ్‌, జగదీశ్వర్‌రెడ్డి, నందిమల్ల అశోక్‌, వామన్‌గౌడ్‌, విశ్వేశ్వర్‌, ప్రశాంత్‌, చెన్నకేశ్వర్‌రెడ్డి, కమలేశ్వరరావు, సత్యనారాయణగౌడ్‌, చంద్రశేఖర్‌నాయక్‌, వీరసాగర్‌, తిలకేశ్వర్‌గౌడ్‌, హేమంత్‌ ముదిరాజ్‌, జోహెబ్‌ హుస్సేన్‌, చిట్యాల రాము, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>