‘కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయ్’.. బీఆర్ఎస్ ధర్నా

కలం యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ట్రాన్స్ కో విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ (BRS Protest) ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు రైతన్నలతో కలిసి ధ‌ర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కర్రే వెంకటయ్య మాట్లాడుతూ.. రైతులకు కోతల్లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాల‌న‌లో నీళ్లు, క‌రెంట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మండిపడ్డారు. కరెంట్ కోతలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే బీఆర్ఎస్ హ‌యాంలో రెప్ప‌పాటు కూడా క‌రెంట్ పోలేద‌ని గుర్తు చేశారు. లో వోల్టేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాల‌న‌లో నీళ్లు, క‌రెంట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారన్న ఆయన.. నియోజ‌క‌వ‌ర్గంలో క‌రెంట్ కోత‌ల‌తో పంట‌లు ఎండిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారులు స్పందించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుంటే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు. రైతుల త‌ర‌ఫున బీఆర్ఎస్ పోరాడుతుంద‌న్నారు.

‘పంట చేతికొచ్చే వరకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి’

సాగులో ఉన్న పంటని కాపాడుకోవాలంటే కరెంటే ఆధారమని గుండ్లపల్లికి చెందిన బండ రామస్వామి యాదవ్ అనే రైతు తెలిపారు. వర్షాలు లేక, బావులు, బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ సరఫరా కీలకంగా మారిందని.. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నపరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పూట 12 గంటలపాటు త్రీఫేజ్ విద్యుత్ అందిస్తున్నామని, రాత్రివేళలో సింగిల్ ఫేజ్ సరఫరా చేస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారని.. కానీ వాస్తవంగా కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేదని ఆరోపించారు. పంట చేతికొచ్చే వరకు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

డిస్కమ్‌ల తీరుపై రైతు ఆగ్రహం

రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు వినియోగంపై డిస్కమ్‌లు కఠినంగా నియంత్రణ విధిస్తున్నాయని బహుపేటకు చెందిన ఇమ్మడి రాంరెడ్డి అనే రైతు అన్నారు . ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా ఎప్పుడొస్తుందో తెలియక త్రీఫేజ్‌ కోసం రైతులు కళ్లలో కాగడా పెట్టుకొని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలొందని వాపోయారు. కొన్ని చోట్ల పగటిపూట సరఫరా చేయగా, మరికొన్ని చోట్ల మధ్యాహ్నం, ఇంకొన్ని చోట్ల రాత్రిపూట త్రీఫేజ్‌ కరెంట్‌ ఇచ్చారని చెప్పారు. వ్యవసాయ మోటార్లన్నీ త్రీఫేజ్‌ కరెంట్‌ ఉంటేనే నడిచేవి కావడంతో.. కేవలం సింగిల్‌ ఫేస్‌ కరెంట్‌కే డిస్కమ్‌లు పరిమితమవుతున్నాయని తెలిపారు. దాంతో బోర్లలో పుష్కలంగా నీళ్లున్న రైతులంతా మోటార్లకు ఆటోమేటిక్‌ స్టార్టర్లు బిగిస్తున్నారని చెప్పుకొచ్చారు.

త్రీఫేజ్‌ కరెంట్‌ వచ్చినప్పుడే మోటార్లు పనిచేసేలా రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నీళ్లు అంతంతమాత్రంగా ఉన్న బోరుబావులకు చెందిన రైతులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్రీఫేజ్‌ కరెంట్‌ను ఏ ప్రాంతంలో ఏయే సమయంలో ఇవ్వనున్నామనే అంశంపై డిస్కమ్‌లు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, గుండ్లపల్లి వెంకటేష్, దండబోయిన వీరేష్ యాదవ్, కౌడే మహేందర్, కాచారం సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, కాసాబు శ్రీనివాస్, బాలయ్య, అంకం నర్సింహా, గంగసాని నవీన్, బీమాగాణి నర్సింహా గౌడ్, అరే శ్రీధర్, రైతులు మరియు బీర్ ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>