విద్యుత్ కోతల‌పై కొప్పుల ఈశ్వర్‌ ఫైర్‌

కలం, పెద్దపల్లి: ఒకవైపు సాగునీటి కొరత, మరోవైపు తీవ్ర విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ (Koppula Eshwar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి సాగు చేసిన రైతులకు ఇప్పుడు కన్నీళ్లే మిగులుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతులకు వెంటనే సాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులతో కలసి బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు.

నిర‌స‌న జ‌రుగుతుండ‌గానే క‌రెంట్ క‌ట్‌

ఎలిగేడులో నిరసన జరుగుతున్న సమయంలోనే రెండుసార్లు కరెంట్ నిలిచిపోవడమే నాణ్యమైన విద్యుత్ సరఫరాకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. వారం రోజుల్లోగా ఎస్సారెస్పీ కాల్వలకు నీరు విడుదల చేయాలని, విద్యుత్ కోతలను నిలిపివేయాలని, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లకు మరమ్మతులు చేపట్టి రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. కనీసం ఆరు గంటల పాటు కూడా నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో రైతులు డీజిల్ జనరేటర్ల ద్వారా మోటార్లు నడుపుకుంటూ అదనపు ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాలి…

గత కేసీఆర్ ప్రభుత్వంలా విద్యుత్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా, పంటల కొనుగోలు సమస్యలను పరిష్కరించి, పంట నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని కోరారు. నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తానిపర్తి స్రవంతి-మోహన్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>