కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ (Karimnagar) లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy), కేంద్ర మంత్రి సంజయ్ (Bandi Sanjay) పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బండి సంజయ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే బండి సంజయ్‌కు బట్టతల వచ్చింది’ అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తనకు, కేటీఆర్‌కు డ్రగ్స్ టెస్ట్ చేయించడానికి సిద్ధమని, దమ్ముంటే బండి సంజయ్ కూడా పరీక్షలకు రావాలని సవాల్ విసిరారు. గతంలో బండి సంజయ్ తన భార్య పుస్తెలతాడు అమ్మి ఎన్నికలలో పోటీ చేసినట్లు చెప్పారని, ఇప్పుడు పంచుతున్న కోట్లాది రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కరీంనగర్‌లోని గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి కారుపై రాళ్లతో దాడి చేయడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. బండి సంజయ్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం కరీంనగర్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య పెరుగుతున్న ఈ రాజకీయ రగడ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

