కలం, కరీంనగర్ బ్యూరో : కోరుట్ల (Korutla), మెట్‌పల్లి (Metpally) పట్టణాలలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) పూర్తి మద్దతు ప్రకటించారు. గురువారం కార్మికులను కలిసి వారి సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పూర్తిగా న్యాయమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నప్పటికీ, చర్యలు మాత్రం గడప దాటడం లేదని తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి జీవో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇస్తే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కార్మికుల సమస్యలపై స్పందన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. జీవో గెజిట్ ఇచ్చి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి వద్ద సమయం లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, నిరసనలు వ్యక్తం చేస్తున్న కార్మికులపై కేసులు నమోదు చేయడం, ధర్నా చేస్తున్న వారికి టెంట్లు ఏర్పాటు చేయనివ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు పూర్తి న్యాయం జరిగే వరకు తాను వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) స్పష్టం చేశారు.
Read Also: పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యా, వైద్యం: పొంగులేటి
Follow Us On : WhatsApp

