కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యా, వైద్యం ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు మండలం లంక మల్లారంలో గురువారం మంత్రి బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా రూ.కోటి అంచనా వ్యయంతో ప్రధాన బీటీ రహదారి నుంచి పాఠశాల వరకు అప్రోచ్ బీటీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇటీవలే రూ.2.70 కోట్ల వ్యయంతో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. పేదవారి పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా చదువుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా మంచి ఆహారం తీసుకుంటూ, మెరుగైన విద్యను అభ్యసించాలనే ఆశయంతో ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న బాలబాలికలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ఇంటి వద్ద తల్లులు చేసే వంటల రుచిని గుర్తు చేసేలా పోషకాహారంతో కూడిన మెనూను అమలు చేస్తున్నామని తెలిపారు. వైద్య రంగంలో కూడా పేదవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని ఆయన (Minister Ponguleti) చెప్పారు.
పేదల పక్షపాతిగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని వివరించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో వంద శాతం ఫలితాలు సాధించిన ప్రిన్సిపాల్, సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, ప్రిన్సిపల్ రాణి, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కాళేశ్వరం ఎఫెక్ట్ : రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్
Follow Us On : WhatsApp

