కలం, వెబ్‌డెస్క్: సర్ ప్రక్రియతో బీజేపీ (BJP) మరో కుట్రకు తెరలేపిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ నేతలంతా ఆగగస్ట్ 3న సర్ ప్రక్రియ (SIR Process) పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. గురువారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సీఎం ఓట్ల సవరణ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులంటే ఓట్లు అడగడమే కాదని, ఓట్లను కాపాడేందుకూ పని చేయాలని సీఎం అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్‌కు రావొద్దని చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే అది కూడా ఆగస్ట్ 3 వరకు మాత్రమే రావొద్దన్నట్లు స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఏ పనైనా జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఓట్లు కాపాడటంలో తమ వంతు కృషి చేయాలని సీఎం రేవంత్ (Revanth Reddy) అన్నారు. బీఎల్‌వోలను ఎవరూ గుర్తు పట్టరని, బీఎల్ఏలే అన్నీ చూసుకోవాలని సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో చాలా మంది ఉంటారని, ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేస్తారని సీఎం అన్నారు. బీజేపీ కుట్ర పూరితంగా ఓట్లు తొలగించే అవకాశముందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ఓట్లు పోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
సర్ ప్రక్రియ ఇంకా 30 శాతం పూర్తి కావాల్సి ఉందని సీఎం అన్నారు. ఈ 30 శాతం అత్యంత కీలమని చెప్పారు. సర్ అనేది నాయకులకు సంబంధించినది కాదని, ప్రజలకు సంబంధించినదని సీఎం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్లేనని తెలిపారు. ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం, సరైన సమయంలో స్పందించకపోవడం వల్లనే ఓట్లు కోల్పోతారన్నారు. ఓటు హక్కు లేకపోతే ప్రజలు సంక్షేమ పథకాలకు కూడా దూరమవుతారన్నారు. అలాగే ఆధార్ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని, దీంతో కనీస గుర్తింపు కూడా లేకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తంగా ఉంటూ ఓట్లను పరిరక్షించాలని ఆదేశించారు.
Read Also: కరెంట్ కోతలు..సాగు కష్టాలు!
Follow Us On : WhatsApp

