నిర్మల్‌లో కుమ్మరుల ఆర్థిక స్థితిపై ప్రత్యేక సర్వే

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో కుమ్మరి వృత్తిపై (Potter Community) ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై గురువారం ప్రత్యేక సర్వే (Special Survey) నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ స్కాలర్ ఆనంద్ పాల్ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా నిర్మల్ పట్టణంలోని కుమ్మరి కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి సంప్రదాయ వృత్తి, ఇతర ఉపాధి మార్గాలు, వ్యాపార కార్యకలాపాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై వివరాలు సేకరించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రస్తుతం పొందుతున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా అందుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. కుమ్మరి వృత్తి అభివృద్ధికి అవసరమైన నైపుణ్య శిక్షణ, రుణ సదుపాయాలు, ఆధునిక పనిముట్లు, ప్రభుత్వ సహాయం తదితర అంశాలపై కుటుంబాల అభిప్రాయాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

సర్వే ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కుమ్మరి వృత్తిని ఆధునికీకరించడంతో పాటు, వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, కుమ్మరి జాగృతి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భూసారపు గంగాధర్, ఉపాధ్యక్షుడు రాజారపు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కొత్తపల్లి బుచ్చన్నతో పాటు పలువురు కుమ్మరి వృత్తి కళాకారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>