కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఆరు నూరైనా మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతారని రాష్ట్ర మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (BRS Leader Niranjan Reddy) ధీమా వ్యక్తం చేశారు . బుధవారం వనపర్తిలో సర్ కార్యక్రమంపై నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ కార్యక్రమం 3నెలల పాటు జరగనుందని మొదటి నెల చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి పార్టీ ఏజెంట్లతో పాటు నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు.
ఓటర్ల సవరణ కార్యక్రమంతో పాటు ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు గుర్తించి పార్టీ దృష్టికి తీసుకురావాలన్నారు. కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన కోరిక ప్రజలలో ప్రగాఢంగా ఉందని, ప్రజల ఆకాంక్ష మేరకు నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దు రాష్ట్రాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడానికి “సర్” వచ్చిందని తెలిపారు. సర్ ను బూచిగా చూపెట్టి ఓట్లు తొలిగించే ప్రమాదం కూడా ఉందని కార్యకర్తలు ఈ విషయమై అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీకి కీలకం అనే విషయాన్ని మరవరాదని, నాయకులు కూడా తప్పనిసరిగా సర్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. బూత్ లెవల్ ఏజెంట్లకు పార్టీలో ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు సంబంధించిన మొత్తం సమాచారం పార్టీకి అందుబాటులో ఉండాలన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఒక్క ఓటు మాత్రమే హక్కుగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో గట్టు యాదవ్, బి.లక్ష్మయ్య, వాకిటి.శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, అశోక్, కృష్ణా నాయక్, రఘుపతి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

