కలం, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది (Ugadi) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కేటీఆర్ (KTR), ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహణ అనంతరం పంచాంగ శ్రవణం ప్రారంభమైంది. ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగ శ్రవణం చేసి, ఈ ఏడాది పరిస్థితులపై తమ అభిప్రాయాలను తెలిపారు.
పండితుల ప్రకారం, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేశారు. విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని తెలిపారు. అయితే ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని తెలిపారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పారు. బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశముందని కూడా హెచ్చరించారు. పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నత పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలు ఉండే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశముందని కూడా తెలిపారు. ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండదని పండితులు వివరించారు.

