కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసే ప్రతి కుట్రలో మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్‌బాబు భాగస్వాముడేనని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్రస్థాయిలో విమర్శించారు. మంథని పట్టణంలోని ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, సర్‌పై బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భూపాలపల్లి జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి , పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘవీర్ సింగ్, నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి వీర్ల వెంకటేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సర్ కార్యక్రమంపై పూర్తిగా ప్రజల్లో అవగాహన లేదన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు మాత్రమే అనుకుంటున్నారని, కానీ జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఎన్యూమెటర్ ఇంటింటికి వస్తారని, గతంలో ఓటు ఉన్నా కూడా ఫారంలో సమర్పిస్తేనే ఓటు నమోదు అవుతుందన్నారు. లేకపోతే ఓటు తొలగించే అవకాశం ఉంటుందని, దీనిపై కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, ఈ క్రమంలో చేపట్టే జైత్రయాత్రలో మంథని నియోజకవర్గానికి హారతి ఇవ్వడానికి వస్తామన్నారు.
రేవంత్ రెడ్డిది ప్రజావంచన పాలన..
పుట్ట మధు అనేక పదవులకు వన్నె తెచ్చాడని, దుద్దిళ్ల కుటుంబాన్ని ఎదిరించగలిగే స్థాయి ఆయనదే అని జీవన్ రెడ్డి ప్రశంసించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉంటూ సీఎంకు సలహాదారుడిగా ఉన్నారని, రేవంత్ రెడ్డి చేసే ప్రతి దోపిడీకి శ్రీధర్ బాబు బాధ్యుడన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదని ప్రజావంచన పాలన అని, యావత్ ప్రజానీకాన్ని మోసం చేయడంలో రేవంత్‌రెడ్డిది ఎంత పాత్ర ఉంటుందో శ్రీధర్‌బాబుది అంతే పాత్ర అని దుయ్యబట్టారు. ఇసుక దోపిడీ అరికట్టని శ్రీధర్‌బాబుకు కూడా వాటా వస్తున్నట్లే కదా ఆయన అన్నారు.
ఎకరాకు పది క్వింటాళ్ల నష్టం..
ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నరకం ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తే రైతులకు వేసుకునే వరి ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. అంటే ఎకరాకు పది క్వింటాళ్ల పంట నష్టపోయినట్లే కాదా అని, ఈ విషయం తెలిసినా శ్రీధర్ బాబు ఎందుకు మంత్రి వర్గంలో మాట్లాడటం లేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా యూరియా బస్తాల కోసం యాప్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టో రాసి ఆడబిడ్డలను మోసం చేసినోడు పేరుకు రాడన్నారు. రాష్ట్రంలో హైడ్రాను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెప్పుకోచ్చాడని, ఆ అంశాన్ని సమర్థించిన ఒకే ఒక్క వ్యక్తి శ్రీధర్‌బాబేనని అన్నారు. ఆనాడు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి, శ్రీధర్‌బాబుకు పడుతుందని హెచ్చరించారు.

