కలం, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ సీసీఐ (Adilabad CCI) పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కపటనాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నేత, శాసనమండలి సభ్యులు దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్రాలవి ఒకే అజెండా అంటూ విమర్శించారు.హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యయన సమాలోచన కేంద్రం ఆధ్వర్యంలో “సీసీఐ పునరుద్ధరణ – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో శాసనమండలి సభ్యులు శ్రవణ్ దాసోజు, మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ లో నీళ్లు, నదులు, అడవులు, జాతీయ రహదారులు, వందేళ్లకు సరిపడా సున్నపురాయి నిల్వలు ఉన్నప్పటికీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదిలాబాద్ జిల్లాను ఆదరించేవారు లేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ తొంగలో తొక్కారని.. మోదీ అజెండాను అమలు చేస్తూ ఆదిలాబాద్ భవిష్యత్తును అదానీకి తాకట్టు పెట్టేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. బ్రౌన్ ఫీల్డ్ కింద సులభంగా పునరుద్ధరించాల్సిన సీసీఐ పరిశ్రమను తెరవెనుక అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ఏపీకి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్ల గ్రాంట్, విశాఖపట్నం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఐఐఎం, ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి అనేక సంస్థలను కేటాయించిందన్నారు. కానీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదని మండిపడ్డారు. కేటీఆర్, జోగు రామన్న మార్గదర్శకత్వంలో ఆదిలాబాద్ సీసీఐ సాధన కోసం, కార్మికుల పక్షాన జరిగే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని భరోసా కల్పించారు.

