11 ఏళ్ల అతీఖా జోరు.. FIA ప్రశంసలు

కలం, స్పోర్ట్స్ : భారత మోటార్‌స్పోర్ట్స్‌లో 11 ఏళ్ల రేసర్ అతీఖా మీర్ (Atiqa Mir) పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఆమె ప్రతిభను ప్రపంచ మోటార్‌స్పోర్ట్స్ సంస్థ FIA ప్రశంసించింది. అతీఖా వంటి యువ రేసర్లు మోటార్‌స్పోర్ట్స్ భవిష్యత్తును మార్చగలరని FIA పేర్కొంది. ఇటీవల ఆమె సాధించిన విజయాలు క్రీడకు ఉజ్వల భవిష్యత్తును సూచిస్తున్నాయని తెలిపింది. అతీఖా ప్రస్తుతం యూరప్‌లో 12-14 ఏళ్ల విభాగంలో పోటీపడుతూ.. తనకంటే ఎక్కువ అనుభవం ఉన్న డ్రైవర్లకు గట్టి పోటీ ఇస్తోంది. F1 అకాడమీ మద్దతు పొందిన తొలి భారతీయురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందింది. భవిష్యత్తులో ఫార్ములా-1లో రేస్ చేయడమే తన లక్ష్యంగా అతీఖా ముందుకు సాగుతోంది.

ఇటీవల ఇటలీలో జరిగిన ఛాంపియన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అకాడమీ రౌండ్‌లో అతీఖా అద్భుత ప్రదర్శన చేసింది. క్వాలిఫయింగ్‌లో పోల్ పొజిషన్ సాధించడంతో పాటు ఈవెంట్ రికార్డును కూడా నమోదు చేసింది. మెర్సిడెస్ జూనియర్ డ్రైవర్ నికోలో పెరికోను వెనక్కి నెట్టి ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. మేలో గ్రీస్‌లో జరిగిన ఛాంపియన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అకాడమీ రెండో రౌండ్‌లో అతీఖా అన్ని విభాగాలలో విజయం సాధించింది. ఈ నెల ప్రారంభంలో స్వీడన్‌లో జరిగిన FIA యూరోపియన్ ఛాంపియన్‌షిప్ రౌండ్‌లో రెండు టాప్-10 ఫినిష్‌లు నమోదు చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది.

అంతర్జాతీయ స్థాయిలో యువ డ్రైవర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని FIA తెలిపింది. యువ ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడం, మోటార్‌స్పోర్ట్స్‌లో ప్రతిభావంతులకు మార్గాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. FIA సభ్య సంస్థ వెస్ట్రన్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ అందిస్తున్న మద్దతుతో అతీఖా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. గతంలో MENA కార్టింగ్ ఛాంపియన్‌షిప్ నేషన్స్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం అంతర్జాతీయ FIA కార్టింగ్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలు సాధిస్తున్న అతీఖా.. భవిష్యత్తులో ఫార్ములా-1లో భారత జెండాను రెపరెపలాడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>