కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు (Balka Suman) బెయిల్ మంజూరైంది. సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుమన్‌కు రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. గత నెలలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఓ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థల కార్యాలయాలపై అవసరమైతే దాడులు చేయాలని మాట్లాడటం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మిలిటెంట్ పోరాటాలు చేయాలని, ఆఫీసులు తగలబెట్టాలని కూడా పేర్కొన్నారు. దీంతో సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పలుమార్లు బెయిల్ కోసం వాదనలు జరగ్గా, బుధవారం నాడు ఎట్టకేలకు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి వరకల్లా సుమన్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

