కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ (BRS) అధినేత కేసీఆర్ (KCR) హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటై పదేండ్ల అనతికాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని కొనియాడారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను, నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు.
ప్రతీప శక్తులనుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని.. పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు, సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కోరుకున్నారు.

