కలం, వెబ్‌డెస్క్: రాఖీ పండుగ (Raksha Bandhan) వేళ రంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన తన అన్నకు ఓ చెల్లి రాఖీ కట్టి అంత్యక్రియలకు సాగనంపింది. షాద్‌నగర్ (Shadnagar) లోని నెహ్రూనగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ చటాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలో మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం తన షాపులో విద్యుత్ సరఫరాలో సమస్య ఉంటే నవీన్ సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై కప్పకూలిపోయాడు.
స్థానికులు గమనించి నవీన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు నవీన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత నవీన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాఖీ పండుగ పూట నవీన్ మృతితో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నవీన్ అంత్యక్రియలు ప్రారంభించిన సమయంలో అతడి చెల్లి పూజిత నవీన్ మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కన్నీళ్లు పెట్టించింది. పండగ పూట అన్నాచెళ్లెల్లను విద్యుదాఘాతం దూరం చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పూజిత అన్న మృతదేహానికి రాఖీ కట్టిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

