కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ (Brett Lee), బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో డేటింగ్ చేస్తున్నట్లు ఎన్నో ఏళ్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఎట్టకేలకు బ్రెట్ లీ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాము ఎప్పుడూ ప్రేమలో లేమని, కేవలం మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా యజమానిగా ఉన్న సమయంలో తాము కలిసి పనిచేశామన్నారు. ఆమె తెలివైన మహిళ అని, తనకు ఆమెపై అపారమైన గౌరవం ఉందన్నారు. తమపై ఎన్నో రూమర్స్ వచ్చినా.. నిజం తెలుసు కాబట్టి ఎప్పుడూ పట్టించుకోలేదని బ్రెట్ లీ పేర్కొన్నారు.
2008 నుంచి 2011 మధ్య బ్రెట్ లీ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ముంబైలోని ఓ రెస్టారెంట్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ వార్తలు మరింత బలపడ్డాయి. అయితే 2010లోనే ప్రీతి జింటా ఈ ప్రచారాలను ఖండిస్తూ.. “ప్రతి ఏడాది నన్ను బ్రెట్ లీతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం చేయడం కామన్‌గా మారింది. మా మధ్య ప్రేమ లేదు, మేము మంచి స్నేహితులమే” అని సోషల్ మీడియాలో స్పష్టంచేశారు.
వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, బ్రెట్ లీ 2006లో ఎలిజబెత్ కెంప్‌ను వివాహం చేసుకుని ఓ కుమారుడికి తండ్రయ్యారు. అనంతరం ఇద్దరూ విడిపోయి 2009లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత 2014లో లానా అండర్సన్‌ను వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ప్రీతి జింటా పెళ్లి చేసుకొని సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లయ్యారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘బట్వారా 1947’ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

