పోలీస్ స్టేషన్లలోనే పాలన నడుస్తోంది: బొత్స సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం సందర్భంగా సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మండిపడ్డారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సచివాలయ సిబ్బందిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో తమ అధినేత వైఎస్ జగన్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకమైన ‘గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ’ను అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. పూర్తి నిబంధనలు పాటిస్తూ పక్కాగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ప్రజాస్వామ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే హక్కు ప్రతి ఒక్క ఉద్యోగికీ ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కమిటీని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన పూర్తిగా పక్కదారి పట్టిందని, పోలీస్ స్టేషన్లలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా పాలన సాగడం లేదని ధ్వజమెత్తారు. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయకూడదు అనే అంశాలపై కూడా పోలీసులు జోక్యం చేసుకోవడం దారుణమని ఆరోపించారు. ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని బొత్స హితవు పలికారు.

ఇదే సమయంలో ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని ప్రస్తుత పాలకులు గుర్తుంచుకోవాలని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజలు, ఉద్యోగులు తగిన బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల కక్షసాధింపు చర్యలు స్వస్తి చెప్పి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>