కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు, రేపు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా నేడు బెంగళూరులో రూ.15,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రవాణా, విద్యుత్, రైల్వే రంగాలకు చెందిన కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
ముందుగా బెంగళూరులోని ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం నగరంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే బెంగళూరు మెట్రో పింక్ లైన్ (కాలేన అగ్రహార నుండి తవరేకెరె వరకు) మార్గాన్ని ప్రారంభిస్తారు. అలాగే మంగళూరులో రూ.850 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు. రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించిన 4 రైల్వే స్టేషన్లను (చామరాజనగర్, చిక్కమగళూరు, సకలేష్పూర్, సుబ్రహ్మణ్య రోడ్) కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
కర్ణాటక పర్యటన ముగిసిన తర్వాత రేపు (నవంబర్ 14) ప్రధాని మోదీ గుజరాత్‌కు వెళ్లనున్నారు. అక్కడ బనస్కాంత జిల్లాలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన అంబాజీ ఆలయంలో ప్రధాని ప్రత్యేక దర్శనం, పూజలు నిర్వహించనున్నారు.

