భార్యపై కోపం పెంచుకుని.. దారుణ హత్య

కలం, భైంసా: భైంసా పట్టణంలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ సాయి కిరణ్ (ASP Sai Kiran)  ఆదివారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా హాదడి గ్రామానికి చెందిన ముసావర్డ్ పాషా అలియాస్ జై భీం భార్యతో కలిసి భైంసా పట్టణంలో నివాసముంటున్నాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు, అనుమానాలు, మనస్పర్థలు కొనసాగుతున్నాయి. భార్య తనతో మాట్లాడకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో నిందితుడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ఆర్‌టీఓ చెక్‌పోస్టు వద్ద భార్య తన స్నేహితురాలితో కలిసి వెళ్తుండటాన్ని గమనించాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడంతో కోపంతో రగిలిపోయాడు.

కత్తి కొనుగోలు చేసి..

అనంతరం చైనా బజార్‌లో రూ.50కు కత్తి కొనుగోలు చేసిన జై భీం.. సేవాలాల్ చౌక్ సమీపంలో భార్య కనిపించడంతో మాట్లాడాలనే నెపంతో వెనుక నుంచి వెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో కడుపు భాగంలో పలుమార్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందడంతో పరారయ్యాడు. హత్య అనంతరం సమీపంలోని కాలువ వద్ద ఉన్న చేనులో రాత్రంతా గడిపిన నిందితుడు, మరుసటి రోజు గ్రామానికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో భైంసాకు తిరిగి వచ్చాడు. ఆటోనగర్‌లోని తన అద్దె ఇంటికి చేరుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని దాచిపెట్టి, రక్తపు మరకలున్న దుస్తులు మార్చుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఏఎస్పీ సాయి కిరణ్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>