కలం, మునుగోడు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘ పరివార్‌పై చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం (BJYM ) రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి (Pininti Narendar Reddy) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రోజు రాత్రి కేరళలో జరిగిన కార్యక్రమంలో గాంధీ పరివార్–సంఘ పరివార్ మధ్య పోరాటంగా రాజకీయ పరిస్థితిని అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శల స్థాయిని దాటాయన్నారు. దేశం కోసం పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల భావజాలాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు మునుగోడు పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడారు.
సంఘ పరివార్ అంటే ఒక కుటుంబం కాదని.. దేశభక్తి, సేవ, క్రమశిక్షణ, సమాజ నిర్మాణం కోసం పనిచేసే అనేక సంస్థలు, లక్షలాది మంది కార్యకర్తల సమూహమని నరేందర్ రెడ్డి (Pininti Narendar Reddy) అన్నారు. దేశమే ప్రథమం అనే భావనతో వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి సమాజం కోసం పనిచేస్తున్న కార్యకర్తల త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం తక్కువ చేసి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదని పేర్కొన్నారు. అధికారం అనేది ఏ ఒక్క కుటుంబానికి శాశ్వత వారసత్వం కాదని, భారత ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని.. దీనిని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.
ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలను కేంద్రీకరించడం కంటే, తెలంగాణ ప్రజల సమస్యలు, యువత భవిష్యత్తు, రైతుల సంక్షేమం, ఉద్యోగాలు, అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని నరేందర్ రెడ్డి సూచించారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అదే సమయంలో దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న సామాన్య కార్యకర్తల సేవలను కూడా గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని, సంఘ పరివార్‌పై రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే విధానాలపై, సిద్ధాంతాలపై ఆరోగ్యకరమైన చర్చకు రావాలి కానీ.. లక్షలాది మంది కార్యకర్తల త్యాగాలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని అన్నారు.
“కుటుంబం కోసం కాదు.. దేశం కోసం” అనే స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదా రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో కూడుకున్నదని, ఆ హోదాకు తగిన భాషను ఉపయోగించాలని సూచించారు. సంఘ పరివార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, దేశం కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలన్నారు.
Also Read : ఓట్ల చోరీ కాదు.. ఓటర్ల మనసులు గెలుస్తాం: కిషన్ రెడ్డి
Follow Us On: X(Twitter)

