కలం, వెబ్ డెస్క్ : AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో (AI Impact Summit) యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీజేపీ నేతలు శనివారం దేశవ్యాప్తంగా భారీ నిరసనల (BJP Protests)కు దిగారు. కాంగ్రెస్ తీరు వల్ల అంతర్జాతీయ వేదికపై దేశం పరువు పోయిందని మండిపడుతున్న బీజేపీ శ్రేణులు, రాహుల్ గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు (BJP Protests) వెల్లువెత్తాయి. దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని టీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే విమర్శించారు. ఇక్కడ నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఆందోళన నిర్వహించారు.
మరోవైపు ముంబైలోని ములుండ్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు చూపి నిరసన తెలిపారు. థానే వెళ్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని తెలిపారు.
Read Also: పేలుళ్లకు కుట్ర.. ఢిల్లీలో హై అలర్ట్
Follow Us On : WhatsApp


