కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బీజీపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ (Nitin Nabin) స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా నితిన్ నబీన్ హాజరై కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఎంతో మంది పోరాటం, బలిదానాలు దాగి ఉన్నాయని కొనియాడారు. 1997 కాకినాడ తీర్మానంతోనే ప్రత్యేక తెలంగాణకు బీజేపీ (BJP) సంపూర్ణ మద్దతు ప్రకటించి, తన నిబద్ధతను చాటుకుందని గుర్తు చేశారు. ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతుకగా మారి “యువకులు దయచేసి ప్రాణాలు బలిపెట్టకండి, మీ కలను మేం సాకారం చేస్తాం” అని తమ ‘చిన్నమ్మ’ సుష్మా స్వరాజ్ ఇచ్చిన భరోసా ఎప్పటికీ మరువలేనిదని వ్యాఖ్యానించారు.
గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పీఎం కిసాన్, ముద్రా రుణాలు, జాతీయ రహదారుల నిర్మాణం, బీబీనగర్ లో ఎయిమ్స్ స్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వంటి ఎన్నో పథకాలతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ రోజు తెలంగాణ నుండి 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధించాలంటే తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కొందరు తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటూ, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని సంచలనఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేస్తూ, అవినీతి రహిత, సమృద్ధ తెలంగాణను నిర్మించడమే బీజేపీ సంకల్పమని తెలిపారు.
చిన్న రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా వాజ్‌పేయి హయాం నుండే ప్రత్యేక తెలంగాణకు బీజేపీ నిరంతరం మద్దతునిచ్చిందని ఆయన అన్నారు. దేశంలోని చిన్న చిన్న సంస్థానాలన్నింటినీ కలిపి ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌గా మార్చడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన దృఢమైన నాయకత్వం వల్లే హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలు నిజాం పాలన నుండి విముక్తి పొందాయన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ కల సాకారం చేస్తూ, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధిని, వాటి గౌరవాన్ని, వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ మరింత ముందుకు సాగుతోందని వివరించారు.

