కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ బైక్ రేసింగ్ వేదికపై చెన్నై కుర్రాడు కావిన్ క్వింటాల్ (Kavin Quintal) మెరుపులు మెరిపించాడు. ప్రతిష్టాత్మక ‘కోపా డి ఎస్పానా డి వెలోసిడాడ్’ (స్పానిష్ ఛాంపియన్‌షిప్) 2026 సీజన్ తొలి రౌండ్‌లోనే రెండుసార్లు టాప్-3లో నిలిచి పోడియం ఫినిష్ సాధించాడు. స్పెయిన్‌లోని జెరెజ్ సర్క్యూట్‌లో జరిగిన ఈ పోటీలలో ఈజీరేస్ టీమ్ తరఫున బరిలోకి దిగిన కావిన్, సూపర్ బైక్ 1000 సీసీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
గత నెలలోనే 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ రేసర్, 2025లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మొదటిసారి ఈ టోర్నీలో పాల్గొన్నాడు. తన తొలి సూపర్‌బైక్ రేస్‌లోనే నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కావిన్ ప్రతిభకు ముగ్ధులైన స్పెయిన్‌కు చెందిన ప్రముఖ రేసింగ్ బృందం ‘ఈజీరేస్ టీమ్’, ఈ ఏడాది ఏప్రిల్‌లో అతనితో పూర్తి సీజన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్వర్డో సాల్వడార్ వెరా నేతృత్వంలోని ఈ జట్టు ద్వారా కావిన్‌కు అత్యుత్తమ సాంకేతిక మద్దతుతో పాటు శక్తివంతమైన బీఎండబ్ల్యూ (BMW) బైక్‌పై రేస్ చేసే అవకాశం లభించింది.
ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ, తాజాగా జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లో కావిన్ కేవలం 1 నిమిషాల 45.549 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత జరిగిన మొదటి రేస్‌లో విజేత జువాన్ మరియా జార్జా కంటే కేవలం 0.605 సెకన్ల వెనుకంజలో నిలిచి రెండో స్థానాన్ని (రన్నరప్) కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రెండో రేస్‌లో కూడా తన జోరును కొనసాగించి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక స్పానిష్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న ఏకైక భారతీయ రేసర్ కావిన్ కావడం విశేషం. గతంలో వరల్డ్ ఎస్‌బీకే వీకెండ్‌లో సూపర్‌స్పోర్ట్ 300 వరల్డ్ ఛాంపియన్‌షిప్ రేస్‌లో పాల్గొన్న మొదటి భారతీయుడిగా కూడా కావిన్ గుర్తింపు పొందాడు.
ఈ అద్భుత విజయంపై కావిన్ క్వింటాల్ స్పందిస్తూ, సీజన్ ఈ విధంగా ప్రారంభమవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అన్నాడు. ఈజీరేస్ టీమ్‌లో చేరడం తన కెరీర్‌లో ఒక పెద్ద అడుగని, తనను జట్టులో త్వరగా ఇమడటానికి అందరూ ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నాడు. మొదటి రౌండ్‌లోనే రెండు పోడియంలు రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని, అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని చెప్పాడు. ఈ ఛాంపియన్‌షిప్ చాలా పెద్దదని, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తూ, నిరంతరం నేర్చుకుంటూ ముందంజ వేయడమే తన లక్ష్యమని వివరించాడు.

