కలం వెబ్ డెస్క్: జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం జమ్మూకశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Aaqib Nabi) భారత జట్టుతో చేరాడు. అయితే సెలక్టర్లు ఆయనను ప్రధాన జట్టులోకి కాకుండా నెట్ బౌలర్‌గా ఎంపిక చేశారు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ తరఫున ఏకంగా 60 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన నబీ, ఈసారి ప్రధాన జట్టులోనే చోటు దక్కించుకుంటాడని అందరూ భావించారు. నబీ అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, సెలక్టర్లు ఆయన స్థానంలో పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్‌ను బ్యాకప్ ఫాస్ట్ బౌలర్‌గా ప్రధాన జట్టులోకి తీసుకున్నారు.
జట్టులో ఇప్పటికే ఉన్న మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో గుర్నూర్ జతకట్టనున్నాడు. నబీని ప్రధాన జట్టులోకి తీసుకోకపోవడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ, దేశవాళీ ప్రదర్శనలపై ఎప్పుడూ చర్చ జరుగుతుందని అన్నారు. భారతదేశంలో టెస్ట్ జట్టును ఎంపిక చేసేటప్పుడు ఎక్కువ మంది సీమర్లను తీసుకోవాల్సిన అవసరం ఉండదని, నబీ జట్టు ఎంపికకు చాలా దగ్గరగా వచ్చినప్పటికీ ప్రస్తుతానికి తాము ముగ్గురు పేసర్లనే ఎంచుకున్నామని వివరించారు. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం గుర్నూర్ బ్రార్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే కూడా మొదటిసారి భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు.
వీరంతా దేశవాళీ క్రికెట్, ఇండియా ‘ఎ’ జట్టులో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, రిషభ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత బ్యాటింగ్ విభాగంలో గిల్, రాహుల్, పంత్‌లతో పాటు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్ నుండి రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వడంతో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు.

