కలం, నిజామాబాద్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను రాజకీయంగా ఖతం చేస్తాం అని నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబానికి చెబుతున్నా అని చెప్పుకొచ్చారు. ధాన్యం రోడ్ల మీద ఆరబోస్తున్నారంటే మొదట కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందనీ, తెలంగాణ కాషాయం కాబోతోందనీ ఎవ్వరూ అడ్డుకోలేరనీ ధీమా వ్యక్తం చేశారు.
మహిళా బిల్లు చేసి తీరుతాం – పునర్విభజన బిల్లు తొందరలోనే అవుతుందనీ స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్లో తొలి బిల్లు పాస్ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా గింజ ధాన్యం కొనలేదని విమర్శించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించావు అని ప్రశ్నించారు. అసెంబ్లీకి సెక్రటేరియట్ కు రాని కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి ఏం మొహం పెట్టుకొని వస్తారు? అని ప్రశ్నించారు. ధాన్యం రోడ్ల మీద ఆరబెడుతుంటే కేసీఆర్ పదేళ్లు ఏం చేసారని, వాటిని చూస్తూ ఎలా జనాల్లోకి వస్తారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటాలు పసుపు రూ. 50 వేలు దాటిస్తామని, అది రైతులు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వంలో పరిపాలన జీరో అని ఆరోపించారు. నిషేధిత జాబితాలోని (22a) భూములు వివాదాల నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి హమీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ ఒక్క ఎకరాన్ని కూడా పరిష్కరించలేదని విమర్శించారు. మరోవైపు, గత ప్రభుత్వం కేవలం కమీషన్లు, డబ్బుల కోసమే రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిదని మండిపడ్డారు. ప్రాణహిత – చేవెళ్ల వద్దే ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్లు రిపోర్ట్ లు ఇచ్చినా నాటి పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రస్తుత ప్రభుత్వం కరవు మండలాలను తలా తోక లేకుండా ఎంపిక చేసిందని విమర్శించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని మండలాలను వదిలేసి, సంబంధం లేని ఇతర మండలాలు ప్రకటించారని కరవు జాబితాలో ప్రకటించారని ఎత్తిచూపారు. అలాగే, రైతులకు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్న ప్రభుత్వం, వారికి ఏ విధంగా నష్ట పరిహారం అందిస్తుందో స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

