కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారని, ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపైనే కన్ను వేశారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన డిలిమిటేషన్‌పై మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాదికి జనాభా ప్రాతిపదికన 159 సీట్లు వచ్చినా పర్వాలేదని చెప్తూ, దక్షిణాదికి అన్యాయం జరిగేలా తన ఆలోచనా విధానాన్ని వ్యక్తపరచడం చూస్తుంటే ఆయన రాష్ట్ర రాజకీయాల కంటే.. కేంద్ర రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సీటుపై కన్ను వేసిన రేవంత్ దక్షిణాదికి అన్యాయం చేస్తూ ఉత్తరాది ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక డీలిమిటేషన్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏలేటి స్పందించారు. బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా దొందు దొందేనని, రాత్రి కలిసుండి, పొద్దున కొట్లాడినట్లు నటిస్తారని విమర్శించారు. బీఆర్ఎస్‌లో కేటీఆర్, కేసీఆర్ సహా మిగతా నాయకులందరూ అంతేనని చెప్పారు. కేంద్రం చెప్పిన దాని కంటే ఉత్తమ విధానం ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
1952,1963,1973 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డీలిమిటేషన్ చేసిందని, 1963 లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 43 సీట్స్ ఉండేవని ఏలేటి తెలిపారు. 1973లో ఒక సీట్ తగ్గి 42 కి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి GSDP ప్రకారం సీట్స్ సర్దుబాటు చేయాలన్నారని, GSDP ప్రకారం చేస్తే ఎస్సీ, ఎస్టీ జనాభాకి అనుగుణంగా సీట్స్ సర్దుబాటు కావని చెప్పారు. డబ్బున్నవాడు ఎక్కువ, డబ్బులేని వాడు తక్కువ అనే వాదన చేస్తున్నారని, దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరారు.

