కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) దర్యాప్తులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్‌కు గురైన వారి జాబితాలో ప్రస్తుత రాష్ట్ర మంత్రి తుమ్మల (Minister Tummala) నాగేశ్వరరావు ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సిట్ (SIT) అధికారులు శనివారం మంత్రి నివాసానికి వెళ్లి ఆయన అధికారిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త మలుపు తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం పాత్రపై సిట్ ఇప్పటికే లోతైన విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో కీలకమైన సాంకేతిక ఆధారాలను ధ్వంసం చేసిన అధికారులను విచారిస్తున్న సిట్, ఇప్పుడు నేరుగా బాధితులైన రాజకీయ ప్రముఖుల నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేస్తుండటంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది.

