కలం వెబ్ డెస్క్ : 2026 సంక్రాంతికి (Sankranti) బాక్సాఫీస్ దగ్గర భారీ తెలుగు చిత్రాలు (Telugu Films) క్యూకట్టడం.. అన్ని సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. అయితే.. 2026 సంక్రాంతి సినిమాల సందడి ఇంకా పూర్తి కాకుండానే.. 2027లో వచ్చే సంక్రాంతి సినిమాల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2027లో కూడా భారీ, క్రేజీ సినిమాల మద్య బాక్సాఫీస్ వార్ తప్పదు అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఇంతకీ.. 2027లో సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏంటి..?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. డైరెక్టర్ బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారు కానీ.. కాస్త ఆలస్యం కానుందని తెలిసింది. చిరు, బాబీ కాంబోలో రూపొందే ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. గతంలో చిరు, బాబీ కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికే రిలీజైంది. అందుకనే.. ఈసారి చేసే సినిమాని కూడా సంక్రాంతికే టార్గెట్ చేశారని టాక్ వినిపిస్తోంది.
ఇక నట సింహం బాలకృష్ణ (Balakrishna).. మలినేని గోపీచంద్ తో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని ఇటీవల అనౌన్స్ చేశారు. ఈపాటికే సెట్స్ పై ఉండాలి కానీ.. స్టోరీలో మార్పులు చేర్పులు చేయడంతో పట్టాలెక్కడం ఆలస్యం అయ్యింది. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఇక వెంకటేష్ (Venkatesh) కూడా సంక్రాంతినే టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేయాలి. అదే కనుక స్టార్ట్ చేస్తే.. సంక్రాంతి టార్గెట్ గానే పట్టాలెక్కిస్తారు. అలాగే నాని, సుజిత్ మూవీ టార్గెట్ కూడా సంక్రాంతే అని వినిపిస్తుంది. శర్వానంద్, శ్రీను వైట్లతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ 2027 సంక్రాంతికే రిలీజ్ అని ప్రకటించారు. చిరు, బాలయ్య, వెంకీ, నాని, శర్వానంద్.. ఈ ఐదుగురు హీరోల సినిమాల్లో మూడు సినిమాలు ఖచ్చితంగా సంక్రాంతికి వస్తాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి.. ఇదే కనుక జరిగితే.. బాక్సాఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ ఏర్పడడం ఖాయం.
Read Also: చరణ్, సుక్కు మూవీ ఎలా ఉంటుందో తెలుసా..?
Follow Us On: Sharechat


