కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా విద్యాశాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను డీఈఓ భోజన్న (Nirmal DEO Bhojanna) శనివారం ఘనంగా సన్మానించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 11 మంది ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, సమాజ నిర్మాణానికి వారు వేసిన పునాదులు చిర స్థాయిగా నిలుస్తాయని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా వారి అనుభవం, మార్గదర్శకత్వం విద్యా వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు తమ సేవాకాల అనుభవాలను పంచుకుంటూ, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తమకు ఈ గౌరవం అందించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు, సహచర ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

