జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కౌంటర్!

కలం, భువనగిరి: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై (Jagadish Reddy) భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Anil Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తోందని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నిధులను కేటాయించిందని చెబుతూ నిధుల వివరాలను వెల్లడించారు. రూ.12వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారుల నిర్మాణం.. రూ.5వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ రహదారుల నూతన నిర్మాణం.. మొత్తంగా రూ.17వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రోడ్ల నెట్‌వర్క్‌ను సమూలంగా మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి, ఇతర వస్తువులతో కూడిన కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం రూ.2వేల కోట్లను వెచ్చించిందని ఈ సందర్భంగా వెల్లడించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలని ఎమ్మెల్యే హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>